రెగ్యుల‌ర్ ట్రైన్‌గా సేవ‌లు అందించ‌నున్న కాకినాడ టౌన్ ఎక్స్ ప్రెస్: ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 15 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలోని శేరిలింగంపల్లి ప్రాంతవాసుల చిరకాల కోరికగా ఉన్న లింగంపల్లి నుండి కాకినాడ వెళ్లే కాకినాడ టౌన్ ఎక్స్ ప్రెస్ రైలు (నంబర్ 12775/12776) మంగళవారం నుండి రెగ్యులర్ ట్రైన్ గా సేవలు అందిస్తుంద‌ని ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. ఈ రైలు ఇంతకుముందు వారానికి మూడు రోజుల పాటు సోమవారం, బుధవారం, శుక్రవారం మాత్రమే లింగంపల్లి – కాకినాడ – లింగంపల్లి మధ్య నడిచేద‌ని, 21 ఏప్రిల్ 2026 మంగళవారం నుండి రెగ్యులర్ సర్వీస్ గా ప్రతి మంగళవారం, గురువారం, శనివారం, ఆదివారం సహా వారం మొత్తం లింగంపల్లి – కాకినాడ – లింగంపల్లి స్టేషన్ల మధ్య సేవలు అందిస్తుంద‌ని తెలిపారు. ఈ ప్రాంతంలో స్థిరపడ్డ ఆంధ్ర ప్రాంత వాసులకు ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంద‌న్నారు.

గడిచిన సంవత్సర కాలంగా ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ సర్వీస్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నం సఫలం అయినందుకు ఈ ప్రాంత వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు. ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రులు అశ్విని వైష్ణవ్, సోమన్న, రైల్వే బోర్డు చైర్మన్ సతీష్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ శ్రీధర్ కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన‌ని అన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ రైలుగా మార్పించడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ రవి కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించారని, నిరంతరం ఎంపీ కార్యాలయంతోపాటు రైల్వే అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఈ ప్రాంత వాసుల కోరిక నెరవేరడంలో ముఖ్య పాత్ర పోషించారని, ఆయ‌న‌ను అభినందిస్తున్నాన‌ని తెలిపారు. ఈ రైలు ప్రతిరోజు రాత్రి 7.00 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6: 03 నిమిషాలకు కాకినాడ చేరుతుందని పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here