మియాపూర్ భూముల‌ను నిరుపేదలకు కేటాయించాలి.. వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్

శేరిలింగంపల్లి, న‌వంబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్ల భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయించవద్దని, అర్హులైన తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, నిరుపేదలకు కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, శేరిలింగంపల్లి ఇంచార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. మియాపూర్‌లోని 100, 101 సర్వే నంబర్ల భూములను సుప్రీంకోర్టు ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో, మంగళవారం వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి ఆయా భూములను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో సుమారు 15 వేల పేద, నిరుపేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, వారి నివాసాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ భూములను అర్హులైన తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీస గృహవసతి లేని నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల ప్రకటనలు, ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు పరస్పర విరుద్ధంగా ఉండటంతో స్థానికుల్లో గందరగోళం, భయాందోళనలు నెలకొన్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే నివాసం ఉంటున్న వారి జోలికి వెళ్లబోమని కలెక్టర్ ప్రకటిస్తుండగా, మరోవైపు ఖాళీగా ఉన్న భూములతో పాటు మొత్తం 550 ఎకరాల భూములను విక్రయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోందన్నారు. ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితిలో స్థానికులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కేటాయించవద్దని, అవి ప్రజల ఆస్తులని ఆయన స్పష్టం చేశారు. మియాపూర్‌లోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, పీఏ నగర్, ప్రశాంత్ నగర్ నివాసితులకు అన్యాయం జరిగితే తెలంగాణ రక్షణ సేన రాష్ట్రవ్యాప్తంగా పేదల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ భూములపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు, ఇక్కడ నివాసం ఉంటున్న నిరుపేదల ఇళ్లను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రక్షణ సేన తరఫున వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు గూడ లావణ్య, విష్ణు చారి, కుమార్ యాదవ్, సుజాత, ప్రవీణ్ బిజిలి, శ్రీనివాస్ నేత, సందీప్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here