శేరిలింగంపల్లి, నవంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి పీహెచ్సీ డాక్టర్‌కు ఆశా వర్కర్లు సమ్మె నోటీసు అందజేశారు. తమకు కనీసం రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

విధి నిర్వహణలో మరణించిన ఆశా వర్కర్లకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అంత్యక్రియల ఖర్చుల కింద రూ.50 వేల ఆర్థిక సాయం తక్షణమే అందించాలని కోరారు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ అవకాశాలు కల్పించాలని, రెండో పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ.30 వేలు చెల్లించడంతోపాటు తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యలను తెలంగాణ ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ శేరిలింగంపల్లి జోన్ కార్యదర్శి కొంగరి కృష్ణతో పాటు ఆశా వర్కర్లు వనజ, నీరజ, సలీమా, ధర్మజన్, హేమలత తదితరులు పాల్గొన్నారు.





