శేరిలింగంపల్లి, ఏప్రిల్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): నగరంలో భారీ మోసానికి పాల్పడిన కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నంబర్ 512/2026లో బీఎన్‌ఎస్ చట్టంలోని సెక్షన్ 316 (2), 318 (4)తో పాటు 3 (5) కింద కేసు నమోదు చేసి, A1 ఎరుకుల మహేష్, A4 షేక్ నజీర్ బాషా, A9 కురపాటి ఉదయ లక్ష్మిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఒక రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్ ఫోన్, యమహా ఫాసినో స్కూటీ (TS07AE5246 ) తోపాటు ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితుల్లో A1 ఎరుకుల మహేష్ (32) జనగామకు చెందినవాడు కాగా, Camel-Q Software Solutions ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సీఈఓగా పనిచేశాడు. A4 షేక్ నజీర్ బాషా (24) గుంటూరు నివాసి కాగా, అదే సంస్థలో ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్నాడు. A9 కురపాటి ఉదయ లక్ష్మి (24) కూడా గుంటూరుకు చెందినదే కాగా, ఆ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేసింది. ఈ కేసులో A2 రాంబాబు, A3 షరీఫ్, A5 శ్రీకాంత్ రెడ్డి, A6 మహిత, A7 ఝాన్సీ, A8 ప్రభాకర్, A10 అబ్దుల్ రహీమ్ పరారీలో ఉన్నారు. కూకట్‌పల్లి జోన్ డీసీపీ రితి రాజ్ శుక్రవారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ప్రధాన నిందితుడు ఎరుకుల మహేష్ 2019 నుంచి 2024 వరకు పలు కంపెనీలలో పనిచేసిన సమయంలో ఉద్యోగార్థులకు తప్పుడు హామీలు ఇచ్చి డబ్బులు వసూలు చేసే విధానాన్ని గమనించాడు. సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ ట్రైనింగ్ పేరుతో శిక్షణ ఇచ్చి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినా, వాస్తవానికి ఎలాంటి సరైన శిక్షణ ఇవ్వకుండా బ్యాక్‌డోర్ మార్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇదే విధానాన్ని అనుకరించి అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. 2024 ఆగస్టు 30న కూకట్‌పల్లి KPHBలోని మంజీర ట్రినిటీ కార్పొరేట్ భవనంలో CamelQ Software Solution Private Limited పేరుతో సంస్థను స్థాపించాడు. కురపాటి ఉదయ లక్ష్మిని హెచ్ఆర్‌గా, షరీఫ్‌ను బ్రాంచ్ హెడ్‌గా నియమించాడు. అక్టోబర్ 2024లో మాదాపూర్ Uptown Cyberabadలో మరో శాఖను ప్రారంభించి, రాంబాబును బ్రాంచ్ హెడ్‌గా నియమించాడు. అదేవిధంగా అయ్యప్ప సొసైటీ, మాదాపూర్‌లో మూడో శాఖను కూడా ప్రారంభించాడు.

ఈ మూడు శాఖలను సీఈఓగా మహేష్ నిర్వహిస్తూ, షేక్ నజీర్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, మహిత, ఝాన్సీ, ప్రభాకర్, ఉదయ లక్ష్మి, అబ్దుల్ రహీమ్ తదితరుల సహకారంతో కార్యకలాపాలు నిర్వహించాడు. ఉద్యోగార్థులు ఒక్కొక్కరి నుంచి రూ.80వేల నుంచి రూ.1.80 లక్షల వరకు వసూలు చేయాలని సూచించేవాడు. ఇందులో రూ.80వేలను బ్యాంకు ఖాతాల్లో (Kotak Mahindra Bank, Bandhan Bank, IDFC Bank) జమ చేసి, మిగిలిన మొత్తాన్ని కమిషన్‌గా తీసుకునేవారు. తరువాత కొందరు ఉద్యోగులు మహేష్‌కు తెలియకుండా రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసి, అందులో రూ.80వేలు మాత్రమే కంపెనీ ఖాతాల్లో జమ చేసి, మిగిలిన మొత్తాన్ని తీసుకున్నారు. మొత్తం 452 మంది అభ్యర్థులు ఈ సంస్థలో చేరగా, వారిలో 130 మందిని ఉచితంగా చేర్చారు. మిగిలిన వారు డబ్బులు చెల్లించారు. మొదట కొంతకాలం జీతాలు చెల్లించినప్పటికీ, తరువాత వాటిని నిలిపివేసి, డిపాజిట్లు కూడా తిరిగి ఇవ్వలేదు.
మొత్తంగా ఈ వ్యవహారంలో సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. రెండు నెలల క్రితం MU Softech Solutions పేరుతో మరో సంస్థను పేరు రిజిస్టర్ చేయకుండా ప్రారంభించి, ఇలాంటి కార్యకలాపాలను కొనసాగించినట్లు సమాచారం. ఉద్యోగుల ఒత్తిడి పెరగడంతో చివరకు సంస్థ కార్యకలాపాలను నిలిపివేసి పరారయ్యాడు. ఈ కేసులో నిందితులు నిరుద్యోగ యువతకు తప్పుడు హామీలు ఇచ్చి, శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నిందితులకు ఇతర కేసుల్లో కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1992/2025, 480/2026 కేసుల్లో, అలాగే KPHB పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 1281/2024లో కూడా ఈ నిందితులపై ఫిర్యాదులు నమోదయ్యాయి.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మారుతి ఈకో కారు (TG08U6596), యమహా ఫాసినో స్కూటీ (TS07AE5246), రెడ్మీ నోట్ 14 ప్రో మొబైల్, బ్యాంక్ పాస్‌బుక్స్, చెక్ బుక్స్, విజిటింగ్ కార్డులు, ఐడీ కార్డులు, రబ్బర్ స్టాంపులు, లెటర్ హెడ్‌లు తదితరాలు ఉన్నాయి. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో మరింత మంది బాధితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, మోసం మొత్తం పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు A1, A4, A9లను న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండ్‌కు పంపించారు. ఈ కేసును మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ డి. కృష్ణ మోహన్, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డి. విజయ్ నాయక్, సబ్ ఇన్‌స్పెక్టర్లు కె. బాలరామ్, సంతోష్ కుమార్, సిబ్బంది, మాదాపూర్ డివిజన్ ఏసీపీ శ్రీధర్ పర్యవేక్షణలో విజయవంతంగా ఛేదించారు.





