ప్రజల మౌలిక సదుపాయాలే ప్రథమ ప్రాధాన్యం: మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి, సాయి రామ్ నగర్ కాలనీలో నెలకొన్న సీసీ రోడ్డు, డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించేందుకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో కలిసి శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు రోడ్ల దుస్థితి, వర్షాకాలంలో నిల్వ ఉండే మురుగు నీరు, డ్రైనేజీ అడ్డంకుల వల్ల తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను నిశితంగా పరిశీలించిన గంగాధర్ రెడ్డి వెంటనే సంబంధిత జలమండలి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు తగిన చర్యలు చేపట్టి సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ మరమ్మత్తుల‌ను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా గంగాధ‌ర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాలే ప్రథమ ప్రాధాన్యంగా ప‌నిచేస్తున్నామ‌న్నారు. భూగర్భ డ్రైనేజీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని, పలు కాలనీలలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు, అలాగే త‌మ‌ దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణన‌లోకి తీసుకుని ప్రత్యేక చొరవతో డివిజన్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అత్యవసరం ఉన్న చోట, నిత్యం పొంగుతున్న ప్రాంతాలలో ప్రథమ ప్రాధాన్యతగా పనులు పూర్తి చేస్తామని అన్నారు. అందులో భాగంగా యుద్ధప్రాతిపదికన ప్రత్యేక చొరవతో ఎన్నో ఏళ్ల క్రితం వేసిన ఓపెన్ నాలాల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాటి స్థానంలో ఆర్ సీసీ పైప్ లైన్ వేయించి శాశ్వత పరిష్కారంగా పనులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి మేనేజర్ ఈశ్వర్ కుమార్, సీనియర్ నాయకులు రమేష్, శేఖర్, శ్రీశైలం, నర్సింగ్ రావు, సూపర్వైజర్ సురేష్, లైన్ మ్యాన్ శ్రీకాంత్, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here