శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): ఆరోగ్యమే నిజమైన సంపద, అది ఉంటేనే జీవితం సార్థకమవుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. హైదరాబాద్లోని ప్రముఖ సంస్థలు బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్, సిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే–2026 సందర్భంగా హెల్త్ కాన్క్లేవ్–2026 జాతీయ స్థాయి సెమినార్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. సిమ్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్తార్ కుర్మారావు, డాక్టర్ సోమయాజులు (జనరల్, లాప్రోస్కోపిక్ సర్జన్), డాక్టర్ రాజశేఖర్ రెడ్డి (రోబోటిక్, ఆర్థోపెడిక్ సర్జన్), చక్రవర్తి (జనరల్ మేనేజర్), వైద్య నిపుణులు, సర్జన్లు, మేధావులు, స్టాఫ్ నర్సులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలోని ప్రస్తుత సవాళ్లు, భవిష్యత్ దిశలపై సమగ్ర చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ సైన్యం దేశాన్ని కాపాడుతుందని, కానీ ఆరోగ్యవంతమైన ప్రజలే దేశాన్ని నిర్మిస్తారని పేర్కొన్నారు. ఆరోగ్యం కేవలం వ్యాధి లేకపోవడం కాదని, సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు అని స్పష్టం చేశారు. వరల్డ్ హెల్త్ డే సందేశం అందరికీ నాణ్యమైన వైద్యం అందించడమేనని, అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సామాన్యుడికి వైద్యం అందేలా వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని అన్నారు. డిజిటల్, లైఫ్ స్టైల్ వ్యాధులు పెరుగుతున్న ఈ కాలంలో చికిత్స కంటే నివారణ మిన్న అని సూచిస్తూ సమతుల్య ఆహారం, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, నీటి వినియోగం, క్రమబద్ధమైన ఆరోగ్య పరీక్షల ప్రాముఖ్యతను వివరించారు. WHO గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రపంచంలో ప్రతి 10 మందిలో 3 మందికి ప్రాథమిక ఆరోగ్య సేవలు అందడం లేదని, దేశంలో ఆరోగ్య ఖర్చు కేవలం 2.1 శాతం మాత్రమే ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరత, ప్రభుత్వ ఆసుపత్రుల నిర్లక్ష్యం, కార్పొరేట్ ఆసుపత్రుల అధిక ఖర్చులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి వేయి మందికి కేవలం 0.5 హాస్పిటల్ బెడ్స్ మాత్రమే ఉండటం పరిస్థితి దారుణతను చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా బలహీన వర్గాలు వైద్య ఖర్చులు భరించలేకపోతున్నాయని, పోషకాహార లోపం, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపం ఆరోగ్య అసమానతలను పెంచుతున్నాయని అన్నారు. దీనికి పరిష్కారంగా ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ఖర్చును 5 శాతం వరకు పెంచాలని, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలను బలోపేతం చేయాలని, డాక్టర్ల నియామకాలు, మందుల సరఫరా పెంపుతోపాటు ఎస్సీ, బీసీ, ఓబీసీ, బలహీన వర్గాలకు ప్రత్యేక పథకాలు, ఆరోగ్య బీమా విస్తరణ అవసరమని సూచించారు.
ఈ సందర్భంగా సిమ్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధునిక వైద్యాన్ని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లడం, నివారణ వైద్యంపై అవగాహన పెంపే భవిష్యత్ ఆరోగ్య దిశ అని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో ఆరోగ్యం ప్రాథమిక హక్కు, అది అందరికీ చేరాలి అనే సంకల్పంతో కార్యక్రమాన్ని ముగించారు.





