శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గుర్తు తెలియని వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని బాబూఖాన్ లేన్ హెచ్పీ గ్యాస్ ఆఫీస్ ఎదురుగా ఈ నెల 2న ఒక వ్యక్తి పడి ఉన్నాడన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అతను ఈనెల 4న మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుని వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని, అతను యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడని, బహుశా సరైన పోషణ, ఆహారం లేక అనారోగ్య సమస్యలతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.






