శేరిలింగంపల్లి, ఏప్రిల్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రపంచ ఆరోగ్య అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని తారానగర్ వీకర్ సెక్షన్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చందానగర్ స్మిత దంత వైద్యశాల సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్మిత దంత వైద్యశాల నిర్వాహకులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ స్వాతి, డాక్టర్ భువన దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, టూత్ పేస్టులు, బ్రష్ లు అందజేశారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం, రాత్రి నిద్ర పోయే ముందు రెండు పూటలా తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలని అన్నారు. ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే నీటితో నోటిని బాగా పుక్కిలించి శుభ్రం చేసుకోవాలని, దంత సమస్యలు ఉంటే అశ్రద్ధ చేయకుండా దంత వైద్యుడిని సంప్రదించి సూచనలు, సలహాలు పాటించి దంతాలను సంరక్షించుకోవాలని అన్నారు. లేదంటే ఆహారాన్ని పూర్తిగా నమలలేక పోవడం వల్ల అజీర్తితోపాటు ఉదరకోశ వ్యాధులు, లివర్, కిడ్నీ, గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయన్నారు. కనుక దంత సంరక్షణ పట్ల అశ్రద్ధ వద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజశేఖర్, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, శివరామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






