శేరిలింగంపల్లి, ఏప్రిల్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్‌లోని ఆర్‌టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం మహా పడి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ నిర్వాహకుడు బుయ్యా బాలరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఉత్తర నక్షత్రం శ్రీ అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా నరసింగ్ గురు స్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని కీర్తించారు. అదే విధంగా సామాజిక సేవలో భాగంగా రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి మంచి స్పందన లభించడంతో అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానంలో పాల్గొన్నారు. భక్తుల సహకారంతో మహా పడి పూజ, రక్తదాన శిబిరం, అన్నప్రసాద కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో బుయ్యా శ్రీకాంత్ గౌడ్, సురేష్, ప్రసాద్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.







