శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా. శోభారాజు, డా. నందకుమార్ దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆగమ శాస్త్ర పండితులు పుండరీకాక్ష, శ్రీనివాస ఆచార్యుల పర్యవేక్షణలో సంప్రదాయబద్ధంగా కళ్యాణోత్సవం జరిగింది. కీబోర్డ్‌పై రాజు, తబలాపై జయకుమార్ సంగీత సహకారం అందించి వేడుకలకు మరింత మాధుర్యం చేకూర్చారు. ఈ మహోత్సవంలో భక్తులు, శిష్యులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని దైవానుభూతితో వీక్షించారు. అన్నమయ్య, రామదాసు కీర్తనలతో పాటు పద్మశ్రీ డా. శోభారాజు స్వీయ రచనలైన సంకీర్తనలు, వేదమంత్రాలు, నాదస్వరాల మధ్య గానమై కళ్యాణ వేడుకకు ఆధ్యాత్మిక శోభను చేకూర్చాయి.

ఈ సందర్భంగా రామా రామభద్ర, జయ జయ రామ, ఇంత చక్కని పెండ్లి కొడుకు, కొండలలో నెలకొన్న, శ్రీ రామనామం తలుతాం తలుతాం, ఏ తీరుగ నను దయ చూచెదవో, పేరంటాల్లు పాడరే పెళ్లి వేళ, కొత్త పెళ్లికొడుకై, పసిడి అక్షింతలవే అనే కళ్యాణ గీతాలను శిష్యులు భక్తి భావంతో ఆలపించి సభను మంత్రముగ్ధులను చేశారు. అనంతరం అన్నమాచార్య భావనా వాహిని పక్షాన పద్మశ్రీ డా. శోభారాజు, డా. నందకుమార్ వేదపండితులు, కళాకారులు, పాల్గొన్న వారందరిని స్వామివారి జ్ఞాపికలతో సత్కరించారు. చివరగా శ్రీ సీతారాముల వారికి మంగళహారతి సమర్పించి, విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు, కళ్యాణ అక్షింతలు, ముత్యాలు అందజేశారు. చివరిగా అరిటాకులో షడ్రసోపేతమైన సాంప్రదాయ కళ్యాణ భోజన ప్రసాదాన్ని అందించి కార్యక్రమాన్ని సీతారాముల వారి అనుగ్రహంతో విజయవంతంగా ముగించారు.






