పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధికి ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదు

  • మహిళా దినోత్సవ ఫ్లెక్సీల తొలగింపుపై బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత బొబ్బ నవతారెడ్డి ధ్వజం
  • ప్రజా సమస్యల కంటే విపక్షాలపై కక్షసాధింపుపైనే ప్రజాప్రతినిధికి మక్కువ ఎక్కువ
  • మ‌హిళా అధికారుల సమక్షంలోనే మహిళా నాయకురాళ్ల అరెస్టులు సిగ్గుచేటు

శేరిలింగంప‌ల్లి, మార్చి 9 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బీఆర్‌ఎస్‌ గుర్తుపై గెలిచి, నైతికంగా దిగజారి పార్టీ ఫిరాయించిన ప్రజాప్రతినిధి అరాచకాలు శృతి మించుతున్నాయని BRS శేరిలింగంపల్లి నాయకులతో కలిసి బొబ్బ నవత రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాప్రతినిధి కక్షసాధింపు చర్యలకు జీహెచ్‌ఎంసీ, పోలీస్ అధికారులు వంతపాడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవ‌ల‌ జరిగిన పరిణామాలపై సోమవారం ఆమె పత్రిక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఏర్పాటు చేసిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను రాజకీయ కక్షతో తొలగించడం దారుణం అన్నారు. కనీసం మహిళా దినోత్సవం ముగిసేవరకైనా ఉంచాలని ప్రాధేయపడినా వినకుండా, అధికార పార్టీ కనుసన్నల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని అన్నారు. నియోజకవర్గంలో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారంపై లేని శ్రద్ధ, ఫ్లెక్సీలు తీయించడం మీద ఉండటం అధికారుల అహంకారానికి నిదర్శనమ‌ని ఆరోపించారు.

ప్రజావాణి రోజునే ప్రజాస్వామ్య ఖూనీ..

సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ గోడు చెప్పుకోవడానికి వస్తే అధికారులు వారికి అందుబాటులో ఉండాల్సింది పోయి అధికార పార్టీ కి భజన చేస్తూ గంటల తరబడి సమీక్షల పేరుతో కాలక్షేపం చేశారు. ఈ అన్యాయంపై వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లిన మమ్మల్ని కనీసం లోపలికి రానివ్వకుండా పోలీసులను ఉసిగొల్పి దౌర్జన్యంగా అరెస్టు చేయించడం సిగ్గుచేటు.. అని అన్నారు.

మహిళా అధికారుల మౌనం – ఆత్మవంచన..

జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన ఇద్దరూ బాధ్యతాయుతమైన మహిళా అధికారులే. తమ కళ్లముందే తోటి మహిళా నాయకురాళ్లపై పోలీసులు తోపులాటలకు దిగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వారి నైతికతకే వదిలేస్తున్నాం. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కడం అధికారులకు శ్రేయస్కరం కాదు. అదే విధంగా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ఎమ్మెల్యే గాంధీకి, ఆయన అడుగులకు మడుగులొత్తుతున్న అధికారులకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. అక్రమ అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు.. అని బొబ్బ నవతారెడ్డి స్పష్టం చేశారు.

ఈ ధర్నా కార్యక్రమంలో కలిడింది రోజా, రాయల కార్తీక్, పొట్ట నరేందర్ యాదవ్, పారునంది శ్రీకాంత్, సంగా రెడ్డి, సంతోష్ రెడ్డి, శరీనా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గౌస్, ప్రకాశ్, ప్రమోద్, మల్లరెడ్డి, అల్లావుద్దీన్, రాజు BRSV, మజీద్, చందర్ రావు, అనంత రెడ్డి, గణేష్ రెడ్డి, జనార్దన్ గౌడ్, నగేష్ రెడ్డి, చందు, రాజశేఖర్, జ‌స్వంత్, గౌతమ్, జీతయ్య, శబ‌నా, సునీత పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here