- స్థలాన్ని పరిశీలించిన బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్
శేరిలింగంపల్లి, మార్చి 6 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో ఉన్న విద్యా వాణి హై స్కూల్ ఎదుట రోడ్డు మరమ్మత్తుల కోసం గుంతలు తవ్వి అలాగే వదిలేయడంతో అటుగా ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నందనం విష్ణు దత్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. స్థలాన్ని పరిశీలించిన నందనం విష్ణు దత్ రోడ్డు గుంతలలో డ్రైనేజీ నీరు చేరి నిల్వ ఉండడం గమనించారు. గుంతలు పూర్తిగా డ్రైనేజీ నీటితో నిండిపోవడంతో అవి కనిపించకుండా పోతున్నాయని, దీనివల్ల అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాలు, కార్లు గుంతల్లో పడుతూ వాహనాలకు నష్టం కలుగుతోందని స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న విద్యా వాణి హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రైనేజీ నుంచి వచ్చే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన గుర్తించారు.

ముఖ్యంగా పాఠశాల పరిసరాల్లో ఈ పరిస్థితి ఉండటం వల్ల విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నందనం విష్ణు దత్ వెంటనే జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. రోడ్డు గుంతలను తక్షణమే పూడ్చి రోడ్డు సురక్షితంగా మారేలా చర్యలు తీసుకోవాలని, అలాగే డ్రైనేజీ నీరు బయటకు రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. అదే సమయంలో అక్కడ వ్యాపిస్తున్న దుర్వాసనను కొంతవరకు తగ్గించేందుకు బీజేపీ డివిజన్ నాయకులు స్వయంగా ముందుకొచ్చి బ్లీచింగ్ పౌడర్ తెప్పించి డ్రైనేజీ నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో చల్లారు. దీంతో అక్కడి ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు రమణయ్య, డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్, ఓబీసీ మోర్చా డివిజన్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.





