శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 11 (నమస్తే శేరిలింగంపల్లి): సాహిత్యమే సమాజ చైతన్య స్ఫూర్తి అని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి రచయితల సంఘం ఆధ్వర్యంలో చందానగర్ లోని సరస్వతి విద్యా మందిర్ లో శేరసం ద్వితీయ వార్షికోత్సవం, కవి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి డి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ హాజరై ప్రసంగించారు.. సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కవుల పాత్ర కీలకమైనదని అన్నారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలైన విశ్వనాథ సత్యనారాయణ, సి.నారాయణరెడ్డి, రావూరి భరద్వాజ్ వంటి ప్రముఖులు నేటి కవులకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. ఆస్తులు కూడబెట్టినా రాని మానసిక ప్రశాంతత మంచి సాహిత్య గ్రంథ పఠనం ద్వారా సిద్దిస్తుందన్నారు. తెలియని సంగతులను అక్షరం నేర్పిస్తుందని ఆయన తెలిపారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కవులు , కళాకారులను ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాషా, సాహిత్యాల మనుగడకు కృషి చేస్తున్న శేరిలింగంపల్లి రచయితల సంఘం నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు . అనంతరం రాష్ట్ర గనుల శాఖ విశ్రాంత డైరెక్టర్ వీడి రాజగోపాల్ , ప్రముఖ కవి, విమర్శకుడు గంటా మనోహర్ రెడ్డి , రామకృష్ణ చంద్రమౌళి , అంజని కుమారి,టి రామస్వామి యాదవ్ లు మాట్లాడారు. మనిషిని కదిలించేది , నడిపించేది కవిత్వమేనని అన్నారు. కవులు అనాధికార శాసనకర్తలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇస్లామిక్ సాహితీ వేదిక అబ్థుల్ రషీద్ సంకలన కర్తగా ప్రచురించిన కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.
ఈ సభా కార్యక్రమానికి శేరిలింగంపల్లి రచయితల సంఘం అధ్యక్షుడు మోటూరి నారాయణ రావు సమన్వయ కర్తగా వ్యవహారించగా శేరసం ఉపాధ్యక్షుడు జేవీ కుమార్ చేపూరి, ప్రధాన కార్యదర్శి రవీందర్ బాబు అరవా, భీమా శ్రీనివాస రావు, విశ్వనాథరెడ్డి, చంద్రశేఖర్ రావులు కవి సమ్మేళనాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు సునీతా రెడ్డి, ప్రీతం, కట్ల చంద్రశేఖర్ రెడ్డి, శేఖర్ ముదిరాజ్, శేరసం కవులు డాక్టర్ రమ్య స్వరూప్, కొలచన విజయ భారతి తదితరులు పాల్గొన్నారు.





