- జేఎస్ఆర్ మాల్ రెండవ సెల్లార్ లో ఘటన
- క్లిన్సింక్ క్లీనికల్ రీసెర్చ్ ప్యానెల్ బోర్డులో ఎగ్స్ పడిన మంటలు
- అదే భవనంలోని నారాయణ విద్యార్థులు భయంతో పరుగులు
- సరైన రక్షణ సౌకర్యాలు లేవంటూ మండిపడుతున్న తల్లిదండ్రులు
శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 10 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనగూడలోని జేఎస్ఆర్ మాల్ బిల్డింగ్ లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఒకే బిల్డింగ్ లో నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, క్లిన్సింక్ క్లీనికల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కొనసాగుతున్నాయి. కాగా రెండవ సెల్లార్ లో ఉన్న క్లిన్సింక్ క్లినికల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్ లోని ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో పెద్ద ఎత్తున దట్టమైన పొగ అలుముకుంది.

అదే భవనంలో ఉన్న నారాయణ విద్యాసంస్థలో ఊపిరి ఆడక పలువురు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ భయంతో బయటకు పరుగులు తీసారు. విద్యార్థుల భారీ అరుపులతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ పిల్లల క్షేమంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన ఫైర్ సేఫ్టీ లేకుండానే విద్యా సంస్థను నడుపుతున్నారని నారాయణ సంస్థపై మండిపడుతున్నారు. ఐదు అంతస్తుల్లో సుమారు 2000 వేల మంది విద్యార్థులు ఉండడం, ఒక్క పదవ తరగతిలోనే సుమారు 300 మంది విద్యార్థులు అభ్యసిస్తుండడం చర్చనీయాంశం.

అదేవిధంగా క్లిన్సింక్ క్లినికల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా సరైన అనుమతులు లేవని సమాచారం. అయితే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అదే బిల్డింగ్ లో ముందు ఓ హోటల్, మరో సూపర్ మార్కెట్ కొనసాగుతుండగా అగ్నిప్రమాదం జరిగిన సమీపంలో భారీ ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఉండడంతో తృటిలో భారీ ప్రాణనష్టం తప్పేంది. అగ్ని ప్రమాదానికి కారణమైన అంశాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ విద్యార్థులకు సరైన రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.






