శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 9 (నమస్తే శేరిలింగంపల్లి): ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్‌ను లాక్కుని పారిపోయిన ఘటనలో ఇద్దరు నిందితులను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అధికారులు వివరాలను వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇర్షద్ స్థానికంగా ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3వ తేదీన అర్ధరాత్రి 12:20 గంటల సమయంలో విధులు ముగించుకుని తన ద్విచక్ర వాహనం (టీజీ15జీ6317)పై మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఇస్నాపూర్ వైపు బయల్దేరాడు. కాగా మార్గమధ్యలో ఆల్విన్ ఎక్స్ రోడ్డు వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతని వద్దకు వచ్చి అతని దగ్గర ఉన్న వివో టి4ఎక్స్5 స్మార్ట్ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. దీంతో బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురిలో ఇద్దరు నిందితులను గుర్తించిన పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక వ్యక్తిని బొల్లారంలోని వెంకట్ రెడ్డి నగర్ కాలనీలో నివాసంటున్న ప్రైవేటు ఉద్యోగి కె.ప్రబీన్ (19)గా గుర్తించారు. మరో వ్యక్తి అదే ప్రాంతంలోని బాలాజీనగర్‌కు చెఎందిన వివేక్ కుమార్ (18)గా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రిమాండ్‌కు తరలించారు.






