శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలంలోని ఇజ్జత్ నగర్ కాలనీ హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరతతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. కాలనీలో డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లుతూ రోడ్లపై ప్రవహించడంతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రమాదాలు రోజూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ సమస్యతో పాటు రోడ్ల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా మారిందని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. గుంతలతో నిండిన రోడ్లు, నిల్వ నీటితో కలిసిపోయిన డ్రైనేజీలు ప్రజల జీవనాన్ని కష్టతరంగా మార్చాయి. ఈ సమస్యలపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, కార్పొరేటర్, స్థానిక నాయకులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాలనీలో ప్రస్తుతం ఉన్న డ్రైనేజీ పైపులు సరిపోవడం లేదని, అవి చిన్నవిగా ఉండటంతో మురుగు నీరు బయటకు వస్తోందని స్థానికులు తెలిపారు. వెంటనే పాత పైపులను తొలగించి, పెద్ద సైజ్ కొత్త డ్రైనేజీ పైపులు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే రోడ్డును వెడల్పు చేసి, ట్రాఫిక్ సమస్యలు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యలపై నిరసన కార్యక్రమంలో AISF శేరిలింగంపల్లి మండల అధ్యక్షుడు టి.నితీష్, మండల కార్యదర్శి ధర్మ తేజ, బీహెచ్పీఎస్ కార్యదర్శి ఎస్. కొండలయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే డ్రైనేజీ, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





