శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): పాపిరెడ్డి కాలనీ లోని శ్రీ రాధాకృష్ణ ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన శ్రీ భక్త మార్కండేయ నాట్య కళామండలి 24వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి పాటల పద్యాల పోటీల కార్యక్రమానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మారబోయిన రవి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాము ఆహ్వానం మేరకు నిర్వహించగా, కళా-సంస్కృతికీ పరిరక్షణకు అంకితమైన ఈ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు మారబోయిన రవి యాదవ్ స్వయంగా బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా రవి యాదవ్ మాట్లాడుతూ కళలు, సంగీతం మన సంస్కృతి ప్రాణమని, ఇలాంటి సంస్థలు కొత్త తరానికి స్ఫూర్తినిస్తాయని, భక్త మార్కండేయ నాట్య కళామండలి 24 ఏళ్లుగా కళా సేవలో నిలిచిన తీరు అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని యువ ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావాలని, కళలకు, కళాకారులకు ఎల్లప్పుడూ తన మద్దతు ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాకారులు, సురభి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ వెంకట్ రెడ్డి, సాయి నందన్ పవన్, రాంబాబు, శ్రీకాంత్ యాదవ్, ప్రసాద్, శశికళ, రామ దేవి, స్వరూప, నిర్వాహకులు, స్థానిక భక్తులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.





