శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా స్థానికుల కలగా నిలిచిన కాయిదమ్మ కుంట చెరువు సుందరీకరణ ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుని, అతి త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ మార్గదర్శకత్వంలో, ఇంచార్జులు చైతన్య, గౌతమ్ గౌడ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనులను వేగవంతం చేయడంతో ఈ ప్రాజెక్ట్ సమయానికి పూర్తయ్యే దశకు వచ్చింది. చెరువు పరిసరాలను ఆహ్లాదకరంగా, పచ్చదనంతో నిండిన వాతావరణంగా తీర్చిదిద్దేందుకు విస్తృత స్థాయిలో సుందరీకరణ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కాలనీవాసులు, గ్రామస్తులు ఆరోగ్య పరిరక్షణతో పాటు వినోదం పొందేందుకు అనువుగా ఆధునిక వాకింగ్ ట్రాక్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా భూగర్భ జలాల పునరుద్ధరణకు ఊతం లభించడంతో పాటు, స్థానిక జీవవైవిధ్యం కూడా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించిన తేదీ, సమయ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. దీంతో హఫీజ్‌పేట్ పరిసర ప్రాంత ప్రజలు ఎంతో ఆసక్తిగా ఈ చెరువు ప్రారంభాన్ని ఎదురుచూస్తున్నారు.






