శేరిలింగంపల్లి, జనవరి 24 (నమస్తే శేరిలింగంపల్లి): జాగో భాగ్యనగర్ – ఛలో బాలాపూర్ నినాదంతో భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, గణేష్ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్మ పరిరక్షణ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, జాగో భాగ్యనగర్ – ఛలో బాలాపూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, ప్రజలంతా ఏకమై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశ భద్రత, ప్రజల జీవనోపాధి, వ్యాపారాలు, వృత్తులపై ప్రభావం చూపుతున్న అక్రమ బంగ్లాదేశీ, రోహింగ్య చొరబాటుదారులను గుర్తించి అరెస్టు చేసి తిరిగి పంపే వరకు ఉద్యమం కొనసాగాలని పిలుపునిచ్చారు.

కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయం కోసం దేశ భద్రతను తాకట్టు పెడుతున్నాయని విమర్శించారు. అక్రమంగా ఓటర్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులు ఇప్పించి చొరబాటుదారులను రక్షించడం ద్వారా దేశానికే ముప్పు తెచ్చిపెడుతున్నారని ఆరోపించారు. వారు కల్తీ ఆహారం, నకిలీ వస్తువులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలపై దాడి చేస్తున్నారని, డ్రగ్స్ మాఫియాకు సహకరిస్తూ యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా విలువైన భూములను ఆక్రమించడం, దేవాలయాలపై దాడులు చేయడం, గోవధ వంటి కార్యకలాపాలతో సమాజ శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారని తెలిపారు. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి సహాయం చేస్తామని హామీ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. అటువంటి హామీలు ఎవరి ప్రయోజనం కోసం ఇస్తున్నారో ప్రజలు గమనించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న SIR కార్యక్రమం చాలా కీలకమని, దీని ద్వారా అక్రమంగా దేశంలోకి వచ్చిన వారిని గుర్తించి తిరిగి పంపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా తక్షణమే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. కులాలు, మతాల పేరుతో విడిపోకుండా దేశం, రాష్ట్రం, ప్రాంత భద్రత కోసం ప్రజలంతా ఐక్యంగా నిలవాలని రవికుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. దేశంపై నిశ్శబ్ద దాడి చేస్తున్న అక్రమ చొరబాటుదారులందరినీ గుర్తించి పంపించేవరకు ఉద్యమం ఆగకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, అశోక్ కుమార్, నాగుల్ గౌడ్, అనిల్ గౌడ్, రామ్ రెడ్డి, రాధాకృష్ణ యాదవ్, మాణిక్, ఎల్లేష్, నరేందర్ యాదవ్, సంజీవ్ స్వామి గౌడ్, నరేందర్ ముదిరాజ్, వేణుగోపాల్ రెడ్డి, కృష్ణ ముదిరాజ్ తదితర నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





