శేరిలింగంపల్లి, జనవరి 22 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని వైశాలి నగర్ నుంచి మసీదు బండ వైపు వెళ్లే లింక్ రోడ్డులో ఉన్న రైల్వే అండర్పాస్ వద్ద నిత్యం ఏర్పడుతున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యతో కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ట్రాఫిక్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ హనుమంత రావు, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ సురేష్ పాల్గొన్నారు. అలాగే పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు కూడా హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ, హఫీజ్పేట్ మంజీర రోడ్ నుంచి మసీదు బండకు వెళ్లే మార్గంలోని రైల్వే అండర్పాస్ వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి సుమారు 15 కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై కొద్ది రోజుల క్రితం ఆయా కాలనీల అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం ద్వారా తన దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. దానికి స్పందనగా ట్రాఫిక్ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, ప్రత్యామ్నాయ మార్గాల సాధ్యతను పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలిపారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించి, పలు సలహాలు, సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సుఖవంతమైన ప్రయాణం అందించే విధంగా త్వరితగతిన చర్యలు చేపడతామని, ఈ అండర్పాస్ వద్ద ట్రాఫిక్ సమస్యను త్వరలోనే పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు డీఈ ఆనంద్, ఏఈ భాస్కర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.





