బొగ్గు కుంభకోణంపై సమాధానం చెప్పే దమ్ములేక డైవర్షన్ డ్రామాలు: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం పై శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చాయన్నారు. బొగ్గు కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు సమాధానం చెప్పే దమ్ములేక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి నోటీసు ఇచ్చారని చిర్రా రవీందర్ యాదవ్ విమర్శించారు. మొన్న ప్రతిపక్ష ఉపనేత హరీశ్ రావుకి, ఇప్పుడు కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం ముమ్మాటికీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మండిపడ్డారు.

కుట్ర పూరితంగా ఇబ్బందులు పెట్టాలి అని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలి సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ఇవన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు తండ్లాడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజల కర్మానికి వదిలేసి దావోస్ అటు నుండి అమెరికా పర్యటన పెట్టుకున్నారన్నారు. సర్కారు సొమ్ముతో రేవంత్ జల్సాలు చేస్తున్నారని విమర్శలు చేశారు. సంక్రాంతి పోయి వారం దాటినా రైతు భరోసా ఎప్పుడిస్తారో చెప్పడం లేదన్నారు. కనీసం దాని ఊసెత్తడం లేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పసలేదని అత్యున్నత న్యాయస్థానాలు తేల్చి చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం మొగలి రేకులు సీరియల్ లా కుట్రలతో నడిపిస్తుందని ఎదేవా చేశారు.

రేవంత్ రెడ్డి విదేశాల్లో విహరిస్తూ అక్కడి నుండి వచ్చే వరకు ఈ సీరియల్ నడిచేలా ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. రేవంత్ సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడుతుండం విచారకరం అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని ప్రభుత్వ శాఖల వెన్ను విరిచారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదంగా మారిందని చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు. రెండేళ్లుగా దర్యాప్తు బృందం కొండనుతవ్వి ఎలుకను కూడా పట్టలేదన్నారు. అధికారులు మారుతున్నారు కానీ ఆధారాలు చూపించడం లేదని, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా న్యాయపరంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంతకుముందే చెప్పారని చిర్రా రవీందర్ యాదవ్ అన్నారు.

కాంగ్రెస్ సర్కారు హామీలు అమలు చేయకుండా, అమలుకు పట్టుబడుతున్న ప్రతిపక్షాలను అక్రమ కేసులు, నోటీసులతో వేధించడంపై సమయం వచ్చినప్పుడు ప్రజలే గుణపాఠం చెబుతారని చిర్రా రవీందర్ యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొంటాము అన్నారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వం చేస్తున్న కుంభ కోణాలపై పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని చిర్రా రవీందర్ యాదవ్ తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here