శేరిలింగంపల్లి, జనవరి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య(AIFDW) ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆరోగ్యకరమైన నేర రహిత సమాజం కోసం మద్యపానాన్ని నిషేధించాలి, మత్తుపదార్ధాలను నిర్మూలించాలి, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలి అనే నినాదంతో మియాపూర్ డివిజన్ పరిధిలో వాడవాడనా జనవరి 13వ తేదీ వరకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ముజాఫర్ అహ్మద్ నగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయ బృందం మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి విజేతలను నిర్ణయించారు. విజేతలకు స్థానిక మియాపూర్ సెక్టార్ ఎస్సై సవిత, శిరీష రెడ్డి చేతుల మీదుగా మెమంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు తాండ్ర కళావతి, అంగడి పుష్ప, వల్లేపు అనిత, శివాని, సుల్తానాబేగం, రజియాబేగం, స్థానిక మహిళలు పాల్గొన్నారు.






