శేరిలింగంపల్లి, జనవరి 5 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్ పరిధిలో ఏసీపీగా పనిచేస్తున్న వెంకట రమణ, చైన్ మెన్ మోహన్లు అక్రమ నిర్మాణాలను పట్టించుకోవడం లేదని, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ వెంకట రమణ, చైన్మెన్ మోహన్ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తమ విధుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా కూడా ఉంటున్నారని అన్నారు. ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను చెత్త బుట్టలో వేస్తున్నారని, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కనుక వెంటనే వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని కోరారు.






