శేరిలింగంపల్లి, డిసెంబర్ 22 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి సర్కిల్లో ఏసీపీ వెంకటరమణ, చైన్ మెన్ మోహన్ లు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతికి ప్రజావాణిలో మండల బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఏసీపీ వెంకటరమణ, చైన్ మెన్ మోహన్ లు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదులను పట్టించుకోకుండా చెత్తబుట్టలో వేస్తున్నారని మల్లారెడ్డి అన్నారు. ఏసీపీ వెంకటరమణ తనకు ఇష్టం వచ్చినట్లు అక్రమ నిర్మాణాలను సీజ్ చేస్తున్నారని, ఆయనకు మర్యాదలు జరగ్గానే మళ్లీ అటు వైపు తొంగి కూడా చూడడం లేదని తెలిపారు. అలాగే చైన్మెన్ మోహన్ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని, అలాగే అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆయన కోరారు.






