శేరిలింగంపల్లి, డిసెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్లోని బస్ బాడీ యూనిట్ వద్ద ఉన్న శ్రీ కనకదుర్గ కాళిమాత ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న బి.సందీప్ తనను అసభ్యంగా దూషించడమే కాకుండా, గర్భవతిగా ఉన్న తనపై దాడి చేశాడని, దీంతో తనకు అబార్షన్ అయిందని ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని కోరుతూ వి.లక్ష్మి అనే బాధిత మహిళ తెలంగాణ ఎస్సి ఎస్టీ కమిషన్ తోపాటు ఆలయ కమిటీకి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నానని, గత నాలుగైదు నెలల కిందట తనపై ఆలయ పూజారి బి.సందీప్ దాడి చేశాడని వాపోయింది. తాను అప్పుడు గర్భవతిగా ఉన్నానని, తనను దూషిస్తూ తనపై దాడి చేశాడని, పలుమార్లు తన పొట్టపై కాలితో తన్నడమే కాకుండా కర్రతోనూ కొట్టాడని తెలిపింది. దీంతో తన గర్భంలో ఉన్న బిడ్డ చనిపోయిందని, ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విచారం వ్యక్తం చేసింది. తనకు ఈ విషయంలో న్యాయం చేయాలని కోరింది. ఈ మేరకు స్పందించిన ఆలయ కమిటీ బాధితురాలు లక్ష్మికి న్యాయం చేస్తామని, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని తెలియజేసింది.






