శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల ఆశయాలను కొనసాగించాలని, వారి ఆశయాలకు అనుగుణంగా పని చేయాలని శేరిలింగంపల్లి యువ నేత, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మార్పణం ఒకటి అని కొనియాడారు. తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లిలోని ఆయన కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేయడానికి.. తన శరీరాన్ని ఒక సమిధలా చేసి ఆత్మార్పణం చేసిన కాసోజు శ్రీకాంతాచారి త్యాగం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని ఈ సందర్బంగా రవీందర్ యాదవ్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంకు ఊపిరి పోసి తన ఊపిరిని తీసుకున్న గొప్ప వ్యక్తి శ్రీకాంతా చారి అని చెప్పారు. తెలంగాణలో నాడు సీఎంగా కెసిఆర్ అమరవీరుల త్యాగాన్ని గుర్తించి సెక్రటేరియేట్ ఎదురుగా అమరుల స్మృతి కేంద్రాన్ని నిర్మించారని గుర్తు చేసారు. తెలంగాణ కోసం నిరంతరం కష్టపడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని రవీందర్ యాదవ్ తెలిపారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రవీందర్ యాదవ్ తో పాటు బి ఆర్ ఎస్ శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు గంగారాం సంగారెడ్డి, ముద్దంగుల మల్లేష్, యువజన నాయకుడు గణేష్ రెడ్డి, సామాజికవేత్తలు నరాల మహేష్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.






