- ఒకే స్థలానికి రెండు, మూడు, నాలుగేసి అనుమతులు – భవన నిర్మాణం మాత్రం ఒక్కటే
- పేరుకు స్టిల్ట్ + 2 పర్మీషన్ – నిర్మించేది ఆరు, ఏడు, ఎనిమిది అంతస్తులు
- మార్టిగేజ్, భారీ ఫీజుల ఎగవేతతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి
- అక్రమ నిర్మాణదారుల సేవల్లో తరిస్తున్న శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ పెద్దసారు
నమస్తే శేరిలింగంపల్లి ( వినయకుమార్ పుట్ట ): ప్రభుత్వాలు ఎంత చిత్తశుద్ధితో పనిచేయాలనుకున్నా అధికారులు అందుకు తగ్గట్టుగా వ్యవహరించకపోతే సర్కారుకు చెడ్డ పేరుతో సహా ప్రభుత్వ ఖజానాకు భారీ గండి తప్పదు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు హైడ్రాను రంగంలోకి దించి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తుంటే మరోవైపు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత లాభం కోసం ఏకంగా ప్రభుత్వానికి ఎసరు పెడుతున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల బరితెగింపుతో ప్రభుత్వానికి భారీ నష్టం జరుగుతుంది. నిర్మాణదారులకు నామమాత్రపు అనుమతులు ఇచ్చి కోట్లు గడుస్తున్నారు. ఆ వ్యవహారం ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.

మార్టిగేజ్ మినహాయింపులతో మొదలు…
ఉదాహారణకు 240 గజాలకు మించిన స్థలంలో ఇల్లు నిర్మించాలంటే కచ్చితంగా నిర్మాణంలో కొంత భాగాన్ని జిహెచ్ఎంసి పేరిట మార్టిగేజ్(తనఖా) చేయాల్సిందే. అందుకు తగ్గట్టు ఫీజు కూడా భారీగానే చెల్లించాల్సి ఉంటుంది. కమర్షియల్ నిర్మాణం కోసం ఐతే ఇంక పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అదనపు అంతస్థు నిర్మాణం చేయాలంటే టీడీఆర్లను ఉపయోగించుకోవాలి. ఆ ఖర్చు అదనం. ఈ మధ్యకాలంలో టిడీఆర్ లకు గణనీయమైన ధర పలుకుతుంది. అయితే ఇక్కడ నిర్మాణదారులు టౌన్ ప్లానింగ్ అధికారుల పూర్తి సహాయ సహకారాలతో అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు చెందాల్సిన భారీ మొత్తం అధికారుల జేబుల్లోకి చేరుకుంటుంది.

ఒకే స్థలానికి 2, 3, నాలుగేసి అనుమతులు…
మార్టిగేజ్(తనఖా) చేసిన భవన నిర్మాణం పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం నిర్మాణం చేపడితేనే ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దానికి ఏమాత్రం భిన్నంగా నిర్మాణం చేపట్టినా ఎప్పటికీ భవనంలోని కొంత భాగం జిహెచ్ఎంసి పేరిటే ఉండిపోతుంది. ఆ భాగాన్ని ఇతరులకు విక్రయించడానికి వీలుండదు. ఈ క్రమంలో మార్టిగేజ్ ను తప్పించుకోవడం అదేవిధంగా పెద్ద మొత్తంలో ఫీజులు తగ్గించుకోవడమే లక్ష్యంగా నిర్మాణదారులు తెలివిగా వ్యవహరిస్తారు. ఒకే స్థలానికి రెండు లేదా మూడు కొన్ని సందర్భాల్లో నాలుగు అనుమతులను విడివిడిగా పొందుతున్నారు. నిర్మాణం విషయానికి వచ్చేసరికి 4,3,2 అనుమతులను కాస్త తుంగలో తొక్కి ఒకటే భవన నిర్మాణం చేపడుతున్నారు.

రెండంతస్తులకే అనుమతి… ఏకంగ 8 అంతస్తుల నిర్మాణం…
ఈ క్రమంలో చిన్నగా చూపించే స్థలానికి స్టిల్ట్ ప్లస్ 2 అనుమతులు మాత్రమే వస్తాయి. కానీ నిర్మాణదారుడు మాత్రం ఐదు ఆరు కొందరైతే ఏకంగా 8 అంతస్తులు సైతం నిర్మిస్తున్నారు. అధికారికంగా అలాంటి నిర్మాణాలు చేపట్టాలనుకుంటే భారీ మొత్తంలో ఫీజులు చెల్లించడంతోపాటు ఆక్యుఫెన్సీ సర్టిఫికెట్ కు దూరం అవ్వాల్సి వస్తుంది. వీటన్నింటికి తోడు భూ సామర్థ్య పరీక్షలు, స్ట్రక్చరల్ డిజైన్స్, స్టెబిలిటీ సర్టిఫికేట్, ఫైర్ సేఫ్టీ మేజర్మెంట్స్ ఇలా అనేక నిబంధనలు తప్పని సరిగా పాటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు తమ జేబులు నింపుకుంటూ అక్రమ నిర్మాణదారులకు అండగా నిలుస్తున్నారు.

అక్రమార్జనలో ఆయనదే మేజర్ షేర్…
ఒకే స్థలంలో రెండేసి అనుమతులు తీసుకొని నిర్మాణం మాత్రం ఒకటే కట్టడం. అదేవిధంగా స్ట్రీట్ ప్లస్ టు పర్మిషన్ మాత్రమే ఉండగా 5 నుంచి 8 అంతస్తుల వరకు చేపట్టే నిర్మాణదారుల నుంచి శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ మొత్తంలో లబ్ధి పొందుతున్నట్టు సమాచారం. నిర్మాణదారుడి స్థితిగతులను బట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది(ఒక బాధితుడు రూ. 18 లక్షలు చెల్లించానని వాపోయాడు). క్షేత్రస్థాయిలో పనిచేసే చైన్మెన్ మొదలుకొని, టీపీఎస్, ఏసీపీ పైన ఉపకమిషనర్ వరకు వాటాల వారీగా వెళ్తున్నట్టు వినికిడి. దోచుకున్న సొమ్మును నిష్పత్తుల వారిగా పంచుకుంటున్నారట. ఐతే అందులో మేజర్ షేర్ టౌన్ ప్లానింగ్ హెడ్ మింగేస్తున్నాడని అతని కిందిస్థాయి సిబ్బంది లోలోపల గునుక్కుంటున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్లో ఇలాంటి స్ల్పిట్ నిర్మాణాలు పదుల సంఖ్యలో కొనసాగుతున్నాయి. (వాటన్నిటి వివరాలు జిహెచ్ఎంసి విజిలెన్స్ కు ఇవ్వడానికి నమస్తే శేరిలింగంపల్లి సిద్ధం). ఈ లెక్కన టౌన్ ప్లానింగ్ సిబ్బందికి ముఖ్యంగా ఆ పెద్దసారుకు ప్రభుత్వం చెల్లించే జీతాలు కంటే ఎన్నో రెట్లు అధికంగా అక్రమ నిర్మాణదారుల నుంచే లభిస్తుండటం గమనార్హం.

మరీ ఇంత బరితెగింపా.?
టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నదే అక్రమ నిర్మాణాలను నియంత్రించడానికి. ఐతే ఇక్కడ వారి విధి నిర్వహణ ఎలాగో గాలికొదిలేసారు. ఐతే కనీసం సదరు అక్రమ నిర్మాణాలపై ఇతరులు ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడం విడ్డూరం. ఉదాహారణనకు నార్నే ఎస్టేట్ రోడ్డులో పైన పేర్కొన్న లాంటి పలు అక్రమ నిర్మాణాలపై బిఆర్ఎస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు మిద్దెల మల్లారెడ్డి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. తర్వాత వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఐనా పట్టింపులేదు. రెండు ముండు అంతస్తుల నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఫిర్యాదులు వస్తే ఇప్పుడు ఏకంగా ఆరు, ఏడు అంతస్తులు కొనసాగుతున్నాయి అంటే అధికారులు ఎంత బరితెగించారో ఇట్టే అర్థం అవుతుంది. ఈ వ్యవహారాలపై వివరణ కోరేందుకు నమస్తే శేరిలింగంపల్లి ప్రతినిధి పలుమార్లు ప్రయత్నించినా శేరిలింగంపల్లి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసిపి వెంకటరమణ అందుబాటులోకి రాలేడు.

తదుపరి కథనం…
2017 సంవత్సరం రహదారిలో నిర్మించారని ఆక్యుపెన్సి సర్టిఫికెట్ రద్దు అయిన పాత భవనానికి తాజాగా ఓసి రిలీజ్ చేసిన ప్రబుద్ధుడు…





