శేరిలింగంపల్లి, నవంబర్ 18 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న రిజర్వేషన్ల నిర్ణయాన్ని బీసీ సమాజం కించపరిచే చర్యగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం చిక్కడపల్లిలోని ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టె విజయకుమార్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్లతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం బీసీ హక్కులను అణగదొక్కే చర్య అని అన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని, ఇది బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అని మండిపడ్డారు. రెండేళ్లలో బీసీలకు సబ్స్టేన్ ద్వారా రావాల్సిన రూ.40 వేల కోట్లు ఇప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని బయటపెడుతోందని వారు విమర్శించారు.

ప్రత్యక్షంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఉత్తుత్తి జీవోలు ఇచ్చి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ గుర్తు లేకుండా గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన నేతలు కోర్టు ఆదేశం మేరకు బీసీలకు ఉన్న 18% చట్టబద్ధ రిజర్వేషన్ను పక్కన బెట్టి, పార్టీ ఆధారితంగా 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం ప్రజాస్వామ్య ప్రక్రియను అవమానించడమే అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ ప్రజా ప్రతినిధులంతా వెంటనే రాజీనామా చేసి బయటకు రావాల్సిందిగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరగనున్న ప్రభుత్వ ప్రజాపాలన వారోత్సవాలను అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించింది. బీసీలకు చట్టబద్ధ రిజర్వేషన్ కల్పించేందుకు పార్లమెంట్లో చట్టం చేయించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతే కాంగ్రెస్ కు బీహార్లో ఎదురైన విధ్వంసకర పరిస్థితి తెలంగాణలో కూడా తప్పదని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో బైరు శేఖర్ గంగపుత్ర, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.





