- భవిష్యత్ ఛాంపియన్‌లకు స్ఫూర్తినిచ్చిన పర్వతారోహకురాలు అన్విత
శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ త్రివేణి స్కూల్ ప్రాంగణంలో మూడు రోజుల పాటు త్రివేణి ప్రైమరీ స్కూల్స్ విద్యార్థుల క్రీడోత్సవ్ ముగింపు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, ఉత్సాహం, విజయకాంక్ష కలగలిసి ఈ సంబురాలు వారిలో సరికొత్త స్ఫూర్తిని నింపాయి. ఈ వేడుకలకు త్రివేణి స్కూల్స్ డైరెక్టర్ డా. వీరేంద్ర చౌదరి, ప్రముఖ పర్వతారోహకురాలు, వుమెన్ పురస్కార్ అవార్డు గ్రహీత పడిమితి అన్విత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్కూల్ డైరెక్టర్ వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలు, యోగాను తమ దినచర్యలో భాగం చేసుకుంటే వారు చేసే ప్రతి పనిలోనూ విజేతలుగా నిలుస్తారని ఉద్ఘాటించారు. కేవలం చదువులే కాకుండా శారీరక దారుఢ్యం కూడా విజయానికి సోపానమని చెప్పారు.

పర్వతారోహకురాలు పడిమితి అన్విత మాట్లాడుతూ ఆటలు ఆడే బాల్యం నుండే భవిష్యత్ విజేతల ఆచరణ సాధ్యమవుతుందని, పిల్లలు ఎంచుకున్న ఆటలలో మరింత ప్రావీణ్యత సాధించాలి, అప్పుడే వారు నిజమైన ఛాంపియన్‌గా ఎదుగుతారని అన్నారు. ఈ సందర్భంగా వివిధ త్రివేణి పాఠశాలల నుండి హాజరై అద్భుత ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డా. వీరేంద్ర చౌదరి, పడిమితి అన్వితల చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందించారు. అత్యంత ఉత్సాహంగా సాగిన ఈ పోటీలలో అన్ని జోన్ల విద్యార్థులను అధిగమించి ఓవరాల్ ఛాంపియన్‌గా మియాపూర్ జోన్ త్రివేణి విద్యార్థులు నిలిచి ఛాంపియన్ షిప్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో త్రివేణి విద్యా సంస్థల సీఆర్‌వోలు, జాట్ టీం సభ్యులు, పాఠశాలల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడాకారులను ఉత్సహపరిచారు. బాలల కేరింతలు, విజయాల ఆనందం, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ క్రీడోత్సవ్ వేడుకలు ఘనంగా ముగిశాయి.





