శేరిలింగంపల్లి, నవంబర్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ లో జరగనున్న ఉప ఎన్నికలో కచ్చితంగా గెలవబోయేది బిఆర్ఎస్ పార్టీనే అని శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన నిర్వహించిన రోడ్ షో కు కూకట్ పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావుతో కలిసి శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేరని, వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రశ్నిస్తూ ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ మంత్రులను సైతం ప్రశ్నిస్తూ వెనక్కి పంపిస్తున్నారని అన్నారు. కచ్చితంగా ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పి తీరుతారని, అడుగడుగునా జనాలు హారతులతో తమ అభ్యర్థికి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తప్పకుండా ఎగురబోయేది బిఆర్ఎస్ జెండానే అని తెలియజేశారు.






