కొంపెల్లి వెంకట్ గౌడ్ సేవ‌లు మ‌రువ‌లేనివి: శ్రీనివాస్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను రచించిన గొప్ప రచయిత కొంపెల్లి వెంకట్ గౌడ్ రచయితగా ,సామాజికవేత్తగా చిరస్మరణీయుడని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో వెంకట్ గౌడ్ సంతాప సభను నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ వెంక‌ట్ గౌడ్‌ అతి చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. మాజీ డీజీపీ పేర్వారం రాములు, కాకతీయ వైస్ ఛాన్సలర్ పేర్వారం జగన్నాధం లండన్ కేం బ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి తెచ్చిన ఫోటోలను తీసుకొని పాపన్న గౌడ్ జీవిత చరిత్ర రాయాలని త‌న‌ను కలవడం జరిగిందని గుర్తు చేశారు. ఎందరో మహనీయుల జీవిత చరిత్ర లను వెంకట్ గౌడ్ రచించడం జరిగిందని అన్నారు. ఆయ‌న చనిపోయాక భౌతికకాయాన్ని గాంధీ ఆసుపత్రికి పరిశోధనకి ఇవ్వాలని కోరార‌ని అన్నారు.

బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ మాట్లాడుతూ బహుజన జాతిని చైతన్యం చేసిన గొప్ప కవి వెంకట్ గౌడ్ అని కొనియాడారు. గౌడ సామాజిక ఉద్యమంలో నూతన ఒర‌వ‌డిని తెచ్చారన్నారు. గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహిత్య రంగానికి, బీసీలకు తీరం లోటని అన్నారు. ఆయన రాసిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజనులలో పెను ప్రకంపనలు సృష్టించింద‌న్నారు. ఒడవని ముచ్చట్లు పుస్తకం నేటికీ స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర నాయకులు సూగూరి దుర్గయ్య గౌడ్ , అంబాల నారాయణ గౌడ్, దొమ్మాట వెంకట్ , బడేసాబ్, సింగం నాగేశ్వర్ గౌడ్, కేశమోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని కొంపల్లి వెంకట్ గౌడ్ కి నివాళులు అర్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here