శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న చాంద్రయాన్ గుట్టకు చెందిన పాత నేరస్తుడు అయిన షేక్ అబ్దుల్ నయీమ్ ను చందానగర్ పోలీస్ స్టేషన్ నేర పరిశోధన సిబ్బంది సిసి కెమెరాలు, ఇతర ఆధారాల ద్వారా గుర్తించి అతనిని అరెస్టు చేశారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరస్తుడు తాను చేసిన నేరాలను అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు రిమాండ్కు తరలించారు. అతను చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మోటార్ సైకిళ్ళు, ఒక ట్రాలి ఆటోను దొంగిలించాడు. పోలీసులు నిందితుని నుండి ఒక ప్యాషన్ ప్రొ ద్విచక్ర వాహనం, ఒక హీరో గ్లామర్ మోటార్ సైకిల్, ఒక ట్రాలి ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు గతంలో శంషాబాద్, చంద్రయాన్ గుట్ట, శాలిబండ, షాహినాయత్ గంజ్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులలో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు. అయినప్పటికీ అతని బుద్ధి మాత్రం మారలేదు. ఈ క్రమంలోనే ఆగస్టు 28వ తేదీన అతన్ని చందానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాడుకు తరలించారు. ఈ కేసులలో చందానగర్ డిటెక్టివ్ సిబ్బంది లింగంపల్లి, చందానగర్, ఓల్డ్ MIG నుండి హైదరబాద్ పాతబస్తీలోని టపచ్చపుత్ర, కాలపత్తర్, ఫలక్ నామ, చంద్రయాన్ గుట్ట ఏరియాలలోని అన్ని సిసి టివి కెమెరాలను ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నిందితున్ని గుర్తించారు. ఈ కేసులో విశేష ప్రతిభ కనబర్చిన కానిస్టేబుళ్ళు బుచ్చి రెడ్డి, ప్రభాకర్, విట్టలయ్య, ఎస్ ఐ నర్సింహా రెడ్డిలను చందానగర్ డిఐ ఎన్.భాస్కర్, మియాపూర్ డివిజన్ ఏసిపి శ్రీనివాస్ కుమార్ అభినందించారు.





