శేరిలింగంపల్లి, ఆగస్టు 22 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రభుత్వం, అధికారులతో పనులు చేయించే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పిలుపుమేరకు సేవ్ హైదరాబాద్ పేరుతో నిర్వహించిన సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ సంఖ్యలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ శ్రేణులతో ఆయన తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను మార్గమధ్యలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ప్రజా పాలన అని మాయమాటలు చెప్పి మోసం చేస్తుందని, సెక్రటేరియట్ నలుమూలల పోలీసులతో పహారా కాస్తూ , ఎక్కడిక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నియంతలా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని, మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే ఉందని, అధికారులతో సమీక్ష చేసి ప్రజల గురించి ఆలోచన చేసిందే లేదన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే రామంతాపూర్ లో కరెంట్ షాక్ తగిలి 5 మంది, బండ్లగూడలో ఇద్దరు చనిపోయేవారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారుల్లో ఏమైనా మార్పులు వస్తాయేమోనని ఒకటిన్నర సంవత్సరం పాటు వేచి చూశామని, ఇక అధికారులను, ప్రభుత్వాన్ని పని చేయించేలా ఒత్తిడి తెచ్చే సమయం ఆసన్నమైందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, డివిజన్ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






