దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

  • ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే కారణం..?
  • చిన్నారిని చంపి విషం సేవించినట్లు పోలీసుల అనుమానం

శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో దారుణం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. క‌ర్ణాట‌క రాష్ట్రం గుల్బ‌ర్గా ప్రాంతానికి చెందిన ల‌క్ష్మ‌య్య (60), అత‌ని భార్య వెంక‌ట‌మ్మ (55), అల్లుడు అనిల్ (40), కుమార్తె క‌విత (38), మ‌న‌వ‌రాలు అప్పు (2)లు మియాపూర్ ప‌రిధిలోని మ‌క్తా మ‌హ‌బూబ్ పేట‌లో ఉన్న త‌మ నివాసంలో గురువారం అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందారు. వారి మృత‌దేహాల‌ను గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

దీంతో పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ఐదుగురి మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి త‌ర‌లించి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా మృత‌దేహాల ప‌క్క‌న వాంతులు క‌నిపించ‌డంతో వారు విషం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా చిన్నారిని హ‌త్య చేసి త‌రువాత వారు విషం తీసుకుని ఉంటార‌ని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ చేప‌ట్టామ‌ని, ద‌ర్యాప్తులో పూర్తి వివ‌రాలు తెలిసే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు తెలిపారు. ఒకే కుటుబంలో ఇలా ఐదుగురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here