శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): గణేష్ ఉత్సవాలతో పాటు నిమజ్జనానికి అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ముందస్తు పటిష్ట ప్రణాళికలతో ముందుకు సాగాలని ఎటువంటి పొరపాట్లు అసౌకర్యాలకు తావు లేకుండా చూడాలని ఆదేశించారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, జోనల్ కి సంబంధించిన అధికారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమీషనర్ సహా పలు విభాగాలకు చెందిన అధికారులతో కలిసి గణేష్ ప్రిపరేడెన్స్ మీటింగ్ నిర్వహించి మల్కం చెరువు, గోపి చెరువు, నల్లగండ్ల చెరువు, రాయసముద్రం చెరువు, సాకి చెరువు, గంగారం చెరువు, గౌతమ్ బేబీ పాండ్, కడియం కుంట, దుర్గం చెరువుతోపాటు ప్రధాన , అంతర్గత రహదారులను శుభ్రపరచాలని ఆయా విభాగాల నడుమ ఎటువంటి సమన్వయ లోపం లేకుండా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని, ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణను అత్యంత పకడ్బందీగా చేపట్టాలన్నారు.

వినాయక ప్రతిమల నిమజ్జనానికి బేబీ పాండ్లకు సిద్ధం చేయాలని, వాటిల్లో పేరుకుపోయిన వ్యర్థాలను ముందస్తుగా తొలగించి సంసిద్ధం చేయాలని సూచించారు. శోభాయాత్రలు జరిగే ప్రాంతాలలో రహదారులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, పాండ్ల వద్ద విద్యుత్ దీపాలు, సానిటేషన్ సహా అనుబంధ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. చెరువుల పరిరక్షణకు సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని, డెంగ్యూ కేసులు గుర్తించ బడిన ప్రాంతాలలో నివారణ చర్యలు చేపట్టాలని ఎంటమాలజీ విభాగాన్ని ఆదేశించారు. సీఎస్ఆర్ కింద పచ్చదనం, పార్కుల నిర్వహణకు చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీలు, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం , పట్టణ ప్రణాళిక, ఎంటమాలజీ విభాగాలతో పాటు ఆయా విభాగాల అధికారులు గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్, మెంబర్లు పాల్గొన్నారు.





