శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేపీ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమాకం అయినందుకు గర్వంగా ఉందని నాయకుడు గంగల రాధాకృష్ణ యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బిజెపి వైస్ ప్రెసిడెంట్ గా నియామకం అవడం తన భాగ్యంగా భావిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రజలు తనకు ఇచ్చిన ప్రేమ, గౌరవం, విశ్వాసం తనను మరింత బాధ్యతగా మార్చిందని, తాను ఈ పదవి స్వీకరించడం ఒక గౌరవం మాత్రమే కాదు, ఒక మహత్తరమైన బాధ్యత కూడా అని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఎప్పటినుండో ప్రజల కోసం, దేశం కోసం, జాతి కోసం పోరాటం చేస్తూనే ఉందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కొత్త దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. అదే మార్గంలో మన జిల్లా, మన పట్టణం అభివృద్ధి చెందేలా తాను కృషి చేస్తానని, ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఎటువంటి తారతమ్యాలు చూపకుండా ముందుకు నడిచే విధంగా సమన్యాయం పాటిస్తానని తెలిపారు.






