శేరిలింగంపల్లి, ఆగస్టు 20 (నమస్తే శేరిలింగంపల్లి): మహిళ మెడలో నుంచి మంగళసూత్రం కాజేసిన ఓ యువకుడిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని జేపీ నగర్‌లో పోలీస్‌మ్యాన్ హౌస్ సొసైటీలో నివాసం ఉంటున్న లోకిరెడ్డి బాలాకుమారి జూలై 4వ తేదీన సాయంత్రం 4.40 గంటల సమయంలో తన కుమారుడు హన్షిత్‌తో కలిసి నాగార్జున ఎన్‌క్లేవ్ సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద రహదారిపై వాకింగ్ చేస్తోంది. అదే అదునుగా భావించిన ఓ యువకుడు వెనుకగా వచ్చి ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కాజేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు ఆమె యత్నించినా విఫలం అయింది. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే నిందితున్ని ఉత్తరప్రదేశ్ లోని ఖుషినగర్ జిల్లా రామ్‌ఖోలా ప్రాంతం బడాహర గ్రామానికి చెందిన బ్రిజేష్ చౌహాన్ (20)గా గుర్తించారు. అతను మియాపూర్‌లోని కాండెర్ 40లో ఉన్న లేబర్ క్యాంపులో నివాసం ఉంటూ స్థానికంగా పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే నిందితున్ని ఆగస్టు 19వ తేదీన ఉదయం 11.45 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. దీంతో అతని నుంచి 26 గ్రాముల మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.






