శేరిలింగంపల్లి, జూన్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్‌లోని ఇజ్జత్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసి వేరే విగ్రహాన్ని పెట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు జరిగిన సంఘటనపై మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారని అన్నారు. గత 30 సంవత్సరాల క్రితం దళితులు ప్రతిష్ట చేసిన విగ్రహం ఉండకూడదనే ఉద్దేశంతోనే విగ్రహాన్ని ధ్వంసం చేసి కొత్త విగ్రహాన్ని పెట్టామని ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులకు స్థానిక ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.






