శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్లోని అన్నమాచార్య భావన వాహినిలో 522వ అన్నమాచార్య ఆరాధన సందర్భంగా డాక్టర్ శోభారాజు, ఆమె శిష్యులు సంయుక్తంగా శ్రీ అన్నమాచార్య అష్టోత్తర శతనామావళి అర్చించారు. పూజానంతరం హరి యవతారమీతడు, దినము ద్వాదశీ నేడు, తాళ్ళపాక అన్నమాచార్య, చిత్తము కొలది మరి చెలి భాగ్యము అనే అన్నమయ్య సంకీర్తనలను భక్తిరంజకంగా ఆలపించి స్వామికి అర్పించారు. వీరికి కీ బోర్డుపై రాజు, అజయ్ తబలాపై వాయిద్య సహకారం అందించారు. డా శోభా రాజు రచించి స్వర పరచిన ఎక్కడున్నావ్ ఓ కల్కి దేవా! మనసారా నిను జూడ కదలి రావా! అంటూ ఎప్పుడొస్తావ్ స్వామీ! అనే ఒక ప్రత్యేక సంకీర్తన పాడారు.

ఈ కార్యక్రమానికి ఆశీః పూర్వక సందేశం ఇవ్వటానికి విశ్వ సనాతన సేవా ట్రస్ట్ చైర్మన్ పండిట్ కాశీనాథ్ మిశ్రా, ధర్మ సాధన సమస్త అధ్యక్షుడు మోహన్ సుందర్, మోహన్ బెహెరా, ప్రొ. ముళ్ళపూడి సత్యనారాయణ, శ్రీ శ్రీ రామ యోగి విచ్చేసి తమ దివ్య సందేశాలను అందించారు. పండిట్ కాశీనాథ్ మిశ్రా మాట్లాడుతూ శోభా రాజు పాడిన ఎప్పుడొస్తావ్ స్వామీ! అనే సంకీర్తన చాలా బాగుందని, దీనిని విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు, అలాగే రానున్న కాలంలో ఇంకా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపి, కల్కి అవతారం విశేషాలు తెలియజేస్తూ రానున్న ప్రపంచ యుద్ధానికి, కలి మలానికి విరుగుడు మందు కేవలం మాధవ నామమే అని తెలిపారు.
గౌరవ అతిథులు మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామియే కల్కి, ఆయన ఖడ్గమే (శ్రీ నందకమే) అన్నమయ్య అని, శోభా రాజు చేస్తున్న అన్నమయ్య యజ్ఞం రానున్న సమాజానికి ఎంతో మేలు చేకూరుస్తుందని తెలిపారు. సుమారు 250 మంది విచ్చేసిన ఈ అద్భుతమైన ఆరాధనకు చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి, అన్నమయ్యకు హారతి అందించి పసందైన భోజన ప్రసాద వితరణ జరిగింది.





