శేరిలింగంపల్లి, మార్చి 27 (నమస్తే శేరిలింగంపల్లి): ఆడుకునేందుకు ఇంటి బయటకు వచ్చిన ఓ చిన్నారి అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్‌లోని మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఓంకార్ కాలనీలో నివాసం ఉంటున్న కొడమంచి మహేష్ కుమార్తె మాలిక (6) మార్చి 21వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో మహేష్ ఇంటి పనిలో నిమగ్నమై ఉండగా, అతని భార్య సుజాత వంట పనిచేస్తోంది. ఈ క్రమంలో ఆడుకునేందుకు ఇంటి బయటకు వెళ్లిన మాలిక కాసేపు అయ్యాక చూస్తే కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల, తెలిసిన వారు, సన్నిహితులు, బంధువల వద్ద పాప ఆచూకీ కోసం గాలించారు. అయినా ఫలితం లేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మాలిక ఛామన ఛాయ రంగులో ఉంటుందని, ముఖం గుండ్రంగా ఉంటుందని, ఎత్తు 3 అడుగులని, ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు నీలి రంగు ఫ్రాక్ ధరించి ఉందని, ఎవరైనా గుర్తు పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని మియాపూర్ పోలీసులు తెలిపారు.