మియాపూర్, అక్టోబర్ 20 (నమస్తే శేరిలింగంపల్లి): కారు ఇంజిన్లో అనుకోకుండా మంటలు చెలరేగడంతో ఇద్దరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాచారం గ్రామానికి చెందిన దుర్గం కృష్ణ (53) డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన యజమానిని వోక్స్ వాగన్ కారు (టీఎస్11ఈఎఫ్6350)లో పటాన్చెరు నుంచి మేడ్చల్ తీసుకెళ్తున్నాడు. కాగా మార్గమధ్యలో మియాపూర్ మెట్రోస్టేషన్ పిల్లర్ నం 627 దగ్గర అకస్మాత్తుగా కారు ఇంజిన్ నుంచి మంటల చెలరేగాయి. దీంతో కారులోని ఇద్దరూ డోర్స్ పగలగొట్టి ప్రాణాలతో బయట పడ్డారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈక్రమంలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.