శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 28 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గుల్మొహర్ పార్క్ కాలనీలో వాకర్స్, కాలనీ వాసులకు CPR శిక్షణ కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో సిటిజన్ హాస్పిటల్, నల్లగండ్ల సౌజన్యంతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా డాక్టర్ దీపక్ హాజరై మాట్లాడుతూ మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె అని, ఇది శరీరంలో ఛాతి, ఊపిరితిత్తుల మధ్య ఉంటుందని తెలిపారు. గుండె ఆక్సిజన్, పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుందని, అయితే మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వలన ప్రస్తుతం వయస్సు, లింగభేదంతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువవుతున్నాయని అన్నారు.
ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్న యువతలో కూడా ఆకస్మిక గుండెపోటు రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న విషయం అని తెలిపారు. గుండెలోని రక్తనాళాలలో పూడికల వల్ల రక్తప్రసరణకు అవరోధం ఏర్పడుతుందని, ఈ కారణంగా రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోతుందని, దీని ఫలితంగా గుండెపోటు వస్తుందని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స తెలిసి ఉండాలని, ఎవరైనా గుండెనొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేసేముందు అంబులెన్స్ కు ఫోన్ చేయాలని అన్నారు. తరువాత ఆస్పిరిన్ టాబ్లెట్ వేయాలని, అనంతరం సీపీఆర్ చేయాలని, దీంతో చాలా వరకు ముప్పు తప్పుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు షేక్ ఖాసిం, S. ఆనంద్, మోహన్ రావు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ రామారావు, కృష్ణమూర్తి, ఇమామ్, హస్పిటల్ ప్రతినిధి జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.