జర్నలిస్తులను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటాం : టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ

  • శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం

నమస్తే శేరిలింగంపల్లి : తోటి జర్నలిస్టుల సంక్షేమంలో.. జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవడంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి చాటిచెప్పింది. కొన్ని నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు మీద రోడ్డు ప్రమాదంలో శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ ప్రస్థానం రిపోర్టర్ బి.శ్రీనివాస్ మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ముందుకు వచ్చింది.

తెలంగాణ ప్రస్థానం రిపోర్టర్ బి.శ్రీనివాస్ నివాసం వద్ద శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులతో  టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ

టియుడబ్ల్యూజె రాష్ట్ర, జిల్లా నాయకుల సహకారంతో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 5లక్షల రూపాయలను సేకరించింది. ఈ మేరకు శుక్రవారం పాపిరెడ్డి నగర్ కాలనీలోని శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, రాష్ట్ర నాయకులు ఫైళ్ల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్ ల చేతుల మీదుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ తమతో పాటు పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రులు, వారి కుటుంబాలు ఆపదలో ఉంటే ఆదుకునేందుకు శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించారని, చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవడంలో, అనారోగ్యంతో బాధపడుతున్న జర్నలిస్టుల ను ఆదుకోవడంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.

శ్రీనివాస్ కుటుంబానికి చేయూతగా రూ. 5లక్షల చెక్కును అందజేస్తున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు

ఇప్పటికే శ్రీనివాస్ కుటుంబానికి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో సైతం ఆర్ధిక సహాయం అందజేశామని, ప్రభుత్వ పెన్షన్ సదుపాయాన్నీ సైతం కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి అందాల్సిన ఇతర సంక్షేమ పథకాలను శ్రీనివాస్ కుటుంబానికి అందజేసేందుకు టియుడబ్ల్యూజే కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, కోశాధికారి లక్ష్మీనారాయణ, టెంజు అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కె.కిషోర్ కుమార్ లతోపాటు ప్రెస్ క్లబ్, టెంజు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here