- సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్
నమస్తే శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ‘మహాలక్ష్మి’ పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. లింగంపల్లి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. లింగంపల్లి బస్ డిపో నందు రిబ్బన్ కట్ చేసి ఉచిత బస్ టికెట్లను మహిళలకు అందజేశారు. అనంతరం లింగంపల్లి ప్రభుత్వ దవాఖానాలో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10లక్షలు పథకాన్ని ప్రారంభించారు.
అనంతరం జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం రూ.10లక్షలు అందించడం జరుగుతుందని తెలిపారు. శనివారం అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన పథకాన్ని నేడు లింగంపల్లి ప్రభుత్వ దవాఖానలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఇతర ఉన్నతాధికారులు కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు పాల్గొన్నారు.