సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పలు విభాగాల్లో పనిచేస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందికి శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. సైబరాబాద్ కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమానికి సీపీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరై రిటైర్ అయిన ఆ ఇద్దరు సిబ్బందిని సత్కరించారు. అనంతరం వారికి పెన్షన్ పేపర్లను సీపీ అందజేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ ట్రాఫిక్ పీఎస్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఎండీ ఇస్మాయిల్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సయ్యద్ షానవాజ్ పాషాలు రిటైర్ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో వుమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్‌రాజ్, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఎస్టేట్ అధికారి ఏసీపీ సంతోష్ కుమార్, ఎంటీవో ఆర్ఐ వెంకట్ స్వామి, సైబరాబాద్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీపీవోఏ) అధ్యక్షుడు భద్రా రెడ్డి పాల్గొన్నారు.