అక్టోబర్ 31వ తేదీన ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. చంద్రుడు ఈ నెలలో రెండోసారి పూర్తి రూపంలో దర్శనమివ్వనున్నాడు. సాధారణంగా ఏడాదిలో 12 నెలల్లో నెలకు చంద్రుడు కేవలం ఒకసారి మాత్రమే పూర్తి రూపంలో దర్శనమిస్తాడు. అదే రోజును హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి అంటారు. అయితే ఈ నెలలో చంద్రుడు రెండో సారి పూర్తి రూపంలో దర్శనమివ్వనున్నాడు. అంటే రెండో పౌర్ణమి ఏర్పడుతుందన్నమాట. దీన్నే బ్లూ మూన్ అని పిలుస్తారు.

సాధారణంగా ఇలా ఒక నెలలో రెండు సార్లు పౌర్ణమి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్ తెలిపారు. ఈ నెలలో అక్టోబర్ 2న పౌర్ణమి వచ్చిందని, 31వ తేదీన మళ్లీ పౌర్ణమి ఏర్పడుతుందని తెలిపారు. దాదాపుగా 2 నుంచి 3 ఏళ్లకు ఒకసారి ఇలా జరుగుతుందని తెలిపారు.
గతంలో 2012లో ఆగస్టులో, 2015లో జూలై నెలలో, 2018లో జనవరి, మార్చి నెలల్లో బ్లూ మూన్ ఏర్పడిందని, ప్రస్తుతం అక్టోబర్ 31న ఈ సంఘటన చోటు చేసుకుంటుందని అన్నారు. మళ్లీ 2023 ఆగస్టు నెలలోనే ఇలా రెండు సార్లు చంద్రుడు పూర్తి రూపంలో దర్శనమిస్తాడని అన్నారు. ఆ ఏడాది ఆగస్టు 2, 31వ తేదీల్లో పౌర్ణమి ఏర్పడుతుందని అన్నారు.
అయితే ఒక నెలలో రెండు సార్లు పౌర్ణమి వస్తే దాన్ని బ్లూ మూన్ అంటారని, అంతేకానీ చంద్రుడు ఆ రోజు నీలి రంగులో కనిపించడని అన్నారు. కేవలం సోషల్ మీడియాలో కొందరు పుకార్లు పుట్టించడం వల్లే జనాలు ఆ విషయం నమ్ముతున్నారని, అందులో నిజం లేదన్నారు. నెలలో రెండోసారి వచ్చే పౌర్ణమి రోజున చంద్రుడు ఇతర పౌర్ణమి రోజుల్లాగే దర్శనమిస్తాడని, నీలి రంగులో దర్శనమివ్వడని, ఈ విషయంపై వచ్చే పుకార్లను నమ్మకూడదని.. రఘునందన్ కుమార్ తెలిపారు.





