శేరిలింగంపల్లి, జూలై 13 (నమస్తే శేరిలింగంపల్లి): ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆయనపై రాజకీయ ద్రోహం ఆరోపణలు చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు సోమవారం శేరిలింగంపల్లిలో భారీ నిరసన చేపట్టాయి. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ బీ-ఫామ్‌తో గెలిచి.. కాంగ్రెస్ జెండా మోస్తూ నేటికి రెండేళ్లు అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజా తీర్పును ఎమ్మెల్యే గాంధీ తాకట్టు పెట్టారని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.

మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఓట్లతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం ప్రజల విశ్వాసానికి ద్రోహం చేసినట్లేనని విమర్శించారు. ప్రజలు ఓటు వేసింది బీఆర్‌ఎస్‌కు.. కానీ అధికారం కాంగ్రెస్‌కు వెళ్లింది. ఇది ఏ రకమైన ప్రజాస్వామ్యం? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ బీ-ఫామ్‌తో గెలిచి కాంగ్రెస్ జెండా మోసిన ఎమ్మెల్యే గాంధీ తన చర్యలకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ రాజకీయ ద్రోహంపై శేరిలింగంపల్లి ప్రజలు తప్పకుండా లెక్కలు అడుగుతారని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు పొట్ట నరేందర్ యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యేకు ప్రజల అభివృద్ధి కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా పదవులు, రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. పార్టీ మారినా నియోజకవర్గ ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని, ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన వారికి భవిష్యత్తులో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి వంటి ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజీ ఇబ్బందులు, దెబ్బతిన్న రహదారులు వంటి సమస్యలు పరిష్కరించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజల అభివృద్ధి కంటే వ్యక్తిగత వ్యాపారాల అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని, దళారులు, పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.





