నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీలోని పలు సమస్యలు, చేపట్టవల్సిన పలు అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. మస్తాన్ నగర్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు కాలనీవాసులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను పరిగణలోకి తీసుకోని, వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ పాదయాత్ర చేశామని చెప్పారు.
సంతులిత, సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేక చొరవతో కాలనీలో రోడ్లు, యూజీడీ నిర్మాణం పనులు పూర్తయ్యాయని, హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విప్ గాంధీకి, కార్పొరేటర్ హమీద్ పటేల్ కి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. అంతేకాక కాలనీ ఎతైన ప్రదేశంలో ఉండటం వల్ల తాగునీటి లో ప్రెజర్ తో సరఫరా అవుతున్నదని, సరిపడా నీరు రావడం లేదని, రెండు తాగునీటి బోర్లను మరమ్మతు చేయాలని, అంగన్ వాడి కేంద్రానికి భవనంను నిర్మించాలని కాలనీ వాసులు ప్రభుత్వ విప్ గాంధీ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సానుకూలంగా స్పందించిన గాంధీ జలమండలి అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తాగునీటి సరఫరాను ప్రజావసరాల దృష్ట్యా ఎక్కువ మోతాదులో నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. బోర్లు మరమ్మత్తులు చేపడుతామని, అంగన్ వాడి భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, డిఈ రమేష్, ఏ ఈ జగదీష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి. ఇబ్రహీం, సాయి కుమార్, రాజు, జాన్, సులేమాన్, దనరాజు, వెంకటేష్, కార్తిక్, కాలనీ వాసులు పాల్గొన్నారు.