- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం వినతి
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు లక్షకు పైగా ఉన్న నేపథ్యంలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస తరఫున కార్పొరేటర్ పదవికి పోటీ చేసేందుకు గాను తమ వర్గానికి చెందిన వారికి టిక్కెట్లను కేటాయించాలని శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు గురువారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఐరా వెల్ఫేర్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు దాదాపు ఒక లక్ష పైచిలుకు ఉన్నందున రాబోయే జీహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలలో తమ రెడ్డి సామాజిక వర్గానికి తెరాస తరఫున ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్ టికెట్లు ఇవ్వాలని కోరారు. అలాగే తెరాస ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందు పరిచిన విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, రెడ్డి కార్పొరేషన్‌పై ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు కె.సునీత రెడ్డి, కె.ప్రభాకర్ రెడ్డి, పి.సంజీవ రెడ్డి, జి.సంజీవ రెడ్డి, జి.అనిల్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, టి.గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, రంగా రెడ్డి పాల్గొన్నారు.