- భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తకావిష్కరణలో సీనియర్ జర్నలిస్ట్ భూమన్న
- పాల్గొన్న జర్నలిస్టులు, కార్మిక నాయకులు
నమస్తే శేరిలింగంపల్లి: భారత విప్లవ కెరటం ఆజాద్ భగత్ సింగ్ పై ఆయన స్నేహితుడు శివవర్మ రచించిన పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ భూమన్న, ఇతర జర్నలిస్టులు, కార్మిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మంగళవారం చందానగర్ లో మున్సిపల్ సర్కిల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో భారత విప్లవ కెరటం భగత్ సింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. రెడ్ బుక్ డే సందర్భంగా భగత్ సింగ్ జీవితంపై ఆయన స్నేహితుడు శివవర్మ రచించిన ఈ పుస్తకాన్ని తెలుగులో ఏ.జి యతిరాజులు, బొమ్మారెడ్డి అనువదించారు. ఈ పుస్తకాన్ని నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ ముద్రించింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ భూమన్న మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరయోధుల్లో, విప్లవకారుల్లో భగత్ సింగ్ అగ్రశ్రేణి నాయకుడని, కానీ ఆయనను రాజకీయాల పేరున ఎవరికి అనుకూలంగా వారు ఒక్కోలా వాడుకుంటున్నారని అన్నారు.
అంబేద్కర్ విషయంలోనూ అదే జరుగుతుందని, అబద్దాలతో, అసత్యాలతో చరిత్రను నిర్మించలేరని గుర్తు చేశారు. స్వాతంత్ర్య యోధుల వాస్తవిక చరిత్రను, వారి ఆలోచనను మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం నాయకుడు శోభన్ చల్లా మాట్లాడుతూ.. భగత్ సింగ్ జీవితం తెరిచిన పుస్తకం అని, యుక్తవయస్సులో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబం ఎక్కిన ధైర్యశీలి భగత్ సింగ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు కొంగరి కృష్ణ, మహేష్, వరుణ్, షఫీ, శశి, విజయ్, ప్రవీణ్, షకీల్, ప్రణయ్, రాజేష్, ప్రవీణ్, అనిల్, సత్యం, ఆనంద్ పాల్గొన్నారు.